
హైదరాబాద్‌లో సీఎం ఆకస్మిక పర్యటన
హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
ఆదివారం హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
అందులో భాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది..
అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతకుముందు అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని గంగూబాయి బస్తీ, బుద్ధ నగర్‌ను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మంత్రి పొన్నం సమీక్ష..
మరో వైపు.. హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.
ఆ క్రమంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీని ఆదేశించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని విడతల వారిగా డ్యూటీలు వేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు..