
పెరాలసిస్‌తో బాధపడుతున్న వ్యక్తికి మానవతా చేయూత
చేతన మీసేవ నిర్వాహకుడు రంజిత్ నాయక్ ఆర్థిక సహాయం
భద్రాచలం, ఫిబ్రవరి 2:
భద్రాచలం పట్టణానికి చెందిన రవీందర్ అనే వ్యక్తి పెరాలసిస్‌తో బాధపడుతూ ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చేతన మీసేవ నిర్వాహకుడు భుక్యా రంజిత్ నాయక్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేశారు.
ఇద్దరు కుమార్తెలకు తండ్రి అయిన రవీందర్ అనారోగ్య కారణంగా పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు భారం అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం పట్టణంలోని చేతన మీసేవ నిర్వాహకుడు భుక్యా రంజిత్ నాయక్‌ను రవీందర్ కుటుంబ సభ్యులు ఆశ్రయించగా, ఆయన వెంటనే స్పందించి చికిత్స కోసం నగదు సహాయం అందించారు. అదనంగా కుటుంబ ఆహార అవసరాల కోసం 50 కిలోల బియ్యం, పిల్లల విద్యకు ఆటంకం కలగకుండా నోట్‌బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా రంజిత్ నాయక్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి వీలైనంత మేర మానవతా కోణంలో సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు చేయూత అందిస్తే వారికి కొత్త ఆశ కలుగుతుందని పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి రవీందర్ కు సహాయం చేయగలరని అన్నారు .




