
పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో హత్యా*యత్నం.. కేసు నమోదు
web desc : తొర్రూరు: కుటుంబ కలహాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తొర్రూరు పట్టణంలోని 14వ వార్డులో తీవ్ర కలకలం రేపింది.డయల్-112కు అందిన ఫిర్యాదుపై స్పందించి విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రుపై కోటేశ్వరరావు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. 14వ వార్డులో భార్యాభర్తల మధ్య కుటుంబ కలహం జరుగుతుందంటూ డయల్-112కు ఫిర్యాదు అందింది. దీంతో బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని, కుటుంబ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో కోటేశ్వరరావు కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు ఎడమ చంక భాగంలో కత్తిపోటు తగిలి రక్తగాయం అయింది. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే మిగతా పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా చేరుకున్న పోలీసులు ఆయనను సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయాన్ని పరిశీలించి చికిత్స అందించడంతో పాటు గాయానికి ఆరు కుట్లు వేసినట్లు తెలిపారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపైనే కత్తితో దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం తొర్రూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తొర్రూరు తరలించినట్లు సీఐ గణేష్ తెలిపారు.




