
మందుబాబులకు ఇక పండుగే… నేటి నుండి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం..
మందుబాబులకు పండుగ లాంటి వార్త. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ మేరకు నేటి నుంచి అమ్మకాలు జరగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు అధికారికంగా కొత్త ఓనర్ల చేతికి మారుతున్నాయి. ఈసారి ఫీజుల పెంపు, కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ఎక్సైజ్ శాఖ.. మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇక.. లిక్కర్ అమ్మకాల విషయంలో చోటు చేసుకున్న మార్పులతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈ రోజు (సోమవారం) అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.
ఈ నూతన పాలసీ 2027 నవంబరు వరకూ అమల్లో ఉండనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగియగా.. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. గత రెండేళ్లలో 724లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాల విలువ రూ.71,550 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగాయి.
దీంతో, మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. కాగా.. మొత్తం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి 80 శాతం మేర సమకూరింది.
దీనికి అదనంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఆదాయం వచ్చింది. పాత మద్యం పాలసీ సమయంలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా రావడం రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడానికి దోహదపడింది.
ఈసారి ఫీజుల పెంపు, కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ఎక్సైజ్ శాఖ.. మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును గతంలో ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది.
ఈ పెంపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతోపాటు మద్యం దుకాణదారులు చెల్లించాల్సిన వార్షిక లైసెన్స్ ఫీజును కూడా అమ్మకాల స్థాయి ఆధారంగా స్లాబ్‌లుగా విభజించారు.
అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో దుకాణానికి ప్రతి ఏటా అత్యధికంగా రూ.కోటి 10 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అమ్మకాలను బట్టి రూ.1.10 కోట్లు, రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ50 లక్షల స్లాబ్‌లను నిర్ణయించారు. అయితే లైసెన్స్‌దారులు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులో ఆరో వంతును ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వసూలు చేసింది.
కొత్త మద్యం పాలసీ ఈ రోజు ప్రారంభం కానుండగా.. కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు సోమవారం నుంచి తమ దుకాణాలను కొత్త పాలసీ ప్రకారం ప్రారంభించనున్నారు. కొత్త పాలసీ కాలంలో గ్రామ పంచాయతీ, పరిషత్, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
అంతేకాకుండా త్వరతో జరగబోయే మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి కారణమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే జోష్‌తో కొత్త మద్యం వ్యాపారులు అమ్మకాలు ప్రారంభించారు.




