
వైద్యుల నిర్లక్ష్యంతో నాలుగు రోజుల శిశువు మృతి
Web desc : కంటికి రెప్పలా కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాలుగు రోజుల శిశువు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో గురువారం చోటు చేసుకుంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన ఒగ్గు గంగా జమున అనే గర్భిణి ఈనెల 19న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది.
ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బీపీ లేవల్స్ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ ఉదయం చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈనెల 19న ఉదయం 6:30 గంటలకు ఆపరేషన్ నిర్వహించి మగ బిడ్డకు పురుడు పోశారు.
అయితే బాలుడు బరువు తక్కువగా ఉన్నాడని చిన్న పిల్లల వైద్యుడు పరిశీలించి రెండు గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచారు.
కానీ రెండు రోజుల పాటు చిన్న పిల్లల వైద్యుడు పట్టించుకోకపోవడంతో శిశువు ఆరోగ్యం క్షీణించింది. దాంతో శిశువు బంధువులు డాక్టర్లను ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడికి వెళ్లిన తర్వాత ప్రైవేట్ వైద్యులు పరిశీలించి శిశువు సుమారు ఐదు గంటల ముందే చనిపోయిందని తెలిపారు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు శిశువును తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ఇక్కడి వైద్యులను ప్రశ్నించారు.
శిశువు ఎలా చనిపోయిందో తెలపాలని నిలదీశారు. అయినా వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు చనిపోతే కనీసం పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు వివరణ కోరగా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. కుటుంబ సభ్యులు శిశువును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లడం వల్లనే మృతి చెందినట్లు తెలిపారు.




