
తెలంగాణలో రెండు రోజులు వైన్సులు,బార్లు బంద్
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ కట్
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాల బంద్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ,
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని మున్సిపాలిటీల పరిధిలోని వైన్స్, బార్లను 2 రోజుల పాటు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ బంద్ . అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే ఫిబ్రవరి 13వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల అధికారులు, ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు . తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని రోజుల కిందట నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ) కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో 2,996 వార్డులకు ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.



