
నాచారం వెంకన్నకి వెండి తోరణం సమర్పణ
ఖమ్మం వాస్తవ్యులు నారాయణ్ రెడ్డి దంపతుల భక్తి సేవ
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 09 2026: మండల పరిధి నాచారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తి పరవశం నెలకొంది. ఖమ్మం వాస్తవ్యులు నారాయణ్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక సేవగా వెండి తోరణాన్ని సమర్పించి, స్వామివారికి అలంకరించడం విశేషంగా నిలిచింది.
సుమారు 12 కిలోల వెండితో తయారైన ఈ తోరణం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 45 లక్షల రూపాయలు వరకు ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామివారికి అలంకరణ చేశారు.
అలంకరణ అనంతరం స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వగా, పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.
నారాయణ్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ, స్వామివారి కృపతో ఈ సేవ చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.




