
ఏన్కూరులో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ తనిఖీ
సామూహిక, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, పంట కుంటల ప్రతిపాదనల పరిశీలన.. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 03 2026: మండలపరిధిలోని బీఎన్ తండా గ్రామపంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్‌తో పాటు పీడీ డీఆర్డీఏ శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న సామూహిక ఇంకుడు గుంతలు మరియు వ్యక్తిగత ఇంకుడు గుంతల పనులను సందర్శించి వాటి పురోగతి, నాణ్యతపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేలా, భూగర్భ జలాలు పెరిగేలా ఈ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం రైతులకు సాగునీటి అవసరాలను తీర్చేందుకు వర్షపు నీటిని నిల్వ చేసే పంట కుంటల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించారు. వర్షాకాలంలో సేకరించిన నీటిని నిల్వ చేసి, అవసరమైన సమయంలో పంటలకు వినియోగించేందుకు పంట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. అర్హులైన రైతులకు ప్రాధాన్యతనిస్తూ పంట కుంటల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా, నాణ్యతతో అమలు కావాలని, ప్రతి పనిని నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఎన్ తండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏపీఓ,ఈసీ,ఏడీ,వ్యవసాయ అధికారి ఏఓ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




