
పాఠశాలకు తాళం వేసిన విద్యార్థులు.. రెండు నెలలుగా పత్తాలేని ఉపాధ్యాయుడు..
Web desc : వారం రోజుల్లో బోర్డు పరీక్షలు ఉన్నాయి. మాకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయుడు రెండు నెలలుగా స్కూల్‌కు రావడంలేదని విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఫరూఖ్ నగర్ మండలం విట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రవి ఉన్నత తరగతులకు ఆంగ్ల పాఠ్యాంశాలను బోధిస్తున్నాడు.
జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవానికి పాఠశాలకు వచ్చిన రవి మరోసటి రోజు నుంచి పాఠశాలకు రావడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఆంగ్ల పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయుడు రెండు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని, తామంతా పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయ్యేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికి పలుమార్లు ఫోన్ చేసినా జవాబు ఇవ్వడం లేదని, తమ నెంబర్లను బ్లాక్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. బోర్డు పరీక్షల దగ్గర వస్తున్నా ఆంగ్ల పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంతో మంగళవారం పాఠశాల విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి గ్రామ సర్పంచ్ వెంకటయ్య ఇంటికి వెళ్లారు.
తమ పాఠశాలలో ఆంగ్ల ని బోధించే ఉపాధ్యాయుడు రవిని పిలిపించండి లేదా కొత్త ఉపాధ్యాయుని కేటాయించండి అంటూ మొరపెట్టుకున్నారు. దీంతో సర్పంచ్ మండల విద్యాధికారి మనోహర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో బుధవారం నుంచి రవి పాఠశాలలో విధులకు హాజరవుతారని గ్రామ సర్పంచ్ వెంకటయ్యకు హామీ ఇచ్చారు.
దీంతో విద్యార్థులు పాఠశాలకు వేసిన తాళం తీశారు. ప్రధానోపాధ్యాయుడు రవి తరగతి గదిలో పాటలు చెప్పకుండా గంటల తరబడి ఫోన్లోనే గడుపుతాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని శ్రద్ధగా పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిని కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రేపటి నుంచి పాఠశాలకు ఉపాధ్యాయుడు : ఎంఈఓ మనోహర్
ఫరూఖ్ నగర్ మండలం విట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆంగ్ల ఉపాధ్యాయుడు రవి బుధవారం నుంచి పాఠశాలలో విధులకు హాజరవుతారని ఫరూఖ్ నగర్ మండల విద్యాధికారి మనోహర్ తెలిపారు.
జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆంగ్ల ఉపాధ్యాయుడు సెలవు పై వెళ్ళాడని, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డీఈవో కార్యాలయంలో ఇన్స్పెక్షన్ విధులలో ఉన్నారని తెలిపారు. విట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయడం జరిగిందని ఎంఈఓ తెలిపారు.



