
మత్తులో హైవేపై కానిస్టేబుల్ హల్చల్.. నిలదీసిన యువకుడు
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన రక్షక భటే మత్తులో తూగుతూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డుపై ఉన్న వేగ నియంత్రణ బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాలు ఏవీ పక్కన లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిబంధనలు అమలు చేయాల్సిన వారే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిలదీసిన ప్రయాణికుడు.. పోలీసుల మధ్య వాగ్వాదం
ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు వెంటనే స్పందించి కానిస్టేబుల్ వాహనాన్ని అడ్డుకున్నాడు. కానిస్టేబుల్ దిగుతున్న క్రమంలో ఆయన విపరీతమైన మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన యువకుడు…
“సమాజాన్ని బాగు చేయాల్సిన పోలీసులే ఇలా తాగి తందనాలాడితే ఎలా?” అంటూ ధ్వజమెత్తాడు. దీంతో కానిస్టేబుల్‌కు, యువకుడికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. యూనిఫాంలో ఉండి ఇలాంటి పనులేంటని యువకుడు ప్రశ్నించడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది.
టెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టిన యువత . సదరు కానిస్టేబుల్ మద్యం సేవించాడని గట్టిగా ఆరోపించిన యువకుడు, ఆయనకు వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని పట్టుబట్టాడు.
పోలీసులు ఒకరికి ఒకరు కొమ్ముకాచుకోకుండా, చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలని డిమాండ్ చేశాడు. ఈ తతంగమంతా వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారులు స్పందించి సదరు కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.




