Telangana
Trending

జర్నలిస్టు ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు.?

జర్నలిస్టు ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు.?

జర్నలిస్టు ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు.?

జర్నలిస్టులకు రక్షణ ఏది.?

దాడులు, బెదిరింపులు పెరుగుతున్న వేళ చట్టం కోసం టీజెఎస్ఎస్ డిమాండ్

తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం (టీజెఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో “జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్” అత్యవసరమని టీజేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిత్యం శ్రమించే ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణించే మీడియా ప్రతినిధులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఎవరు పడితే వారు దాడులకు దిగుతున్నారన్న ఆందోళన
రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు, గల్లీ స్థాయి నాయకులు, వారి అనుచరులు ఇలా ఎవరు పడితే వారు జర్నలిస్టులపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని గౌటి రామకృష్ణ విమర్శించారు. వాస్తవాలు రాస్తున్నందుకు, అవినీతి, అక్రమాలు వెలికితీస్తున్నందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటూ తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఆధారాలు లేకుండా కేసులు, పోలీసుల వైఖరి మారాలి

చాలా సందర్భాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే జర్నలిస్టులపై కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ కూడా వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఫిర్యాదు చేశారన్న నేపంతో ముందుగా జర్నలిస్టులపైనే చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. కొందరు రాజకీయ నాయకుల, అధికారుల ఒత్తిడికి పోలీసులు లోనై నిర్దోషులైన జర్నలిస్టులను జైలుకు పంపించడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.

ఫోర్త్ ఎస్టేట్ విలువ కావాలని తగ్గిస్తున్నారా.?

ప్రజల సమస్యలను, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా విలువను కొందరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గౌటి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు పొందిన రంగంలో పనిచేసే జర్నలిస్టులకే రక్షణ లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. అందుకోసమే
“జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్” అత్యవసరం అన్నారు.
జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టం అవసరమని గౌటి రామకృష్ణ స్పష్టం చేశారు. జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వస్తేనే మీడియా ప్రతినిధులు భయంలేకుండా పని చేయగలరని అన్నారు. ఈ చట్టం ద్వారా దాడులకు, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

అందరూ ఏకతాటిపైకి రావాలి

జర్నలిస్టులు సంఘాలకు అతీతంగా ప్రతి జర్నలిస్టు, ప్రతి సంఘ నాయకుడు ఒకే వేదికపైకి రావాలని గౌటి రామకృష్ణ పిలుపునిచ్చారు. “జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్” సాధన కోసం సమిష్టిగా పోరాడితేనే ఫలితం సాధ్యమవుతుందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల రక్షణ కోసం చట్టం తీసుకురాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల భద్రత కోసం పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని గౌటి రామకృష్ణ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button