
అనర్హత పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయండి.. స్పీకర్ సహా 9 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ సహా 9 మంది ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో పార్టీ మారలేదని స్పీకర్ ప్రకటించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్‌గౌడ్, సంజయ్, తెల్లం వెంకట్రావుతో పాటు స్వయంగా స్పీకర్ కూడా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
వీరంతా తమ వాదనలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణ మే 6వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టుకు బీఆర్ఎస్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ , దానం, కడియం ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తూ వీరి పై వేటు వేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.
ఈ క్రమంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పీకర్ ను ఆదేశించింది. ఈ నేఫథ్యంలో విచారణ జరిపిన స్పీకర్ వీరంతా పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవంటూ ఈ పదిమందికి క్లిన్ చిట్ ఇచ్చారు.
స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇందులో గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన పేరును తమ పిటిషన్ లో పేర్కొనలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు గూడెం మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. మరి ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.



