
మెడికో సురేష్ ఆత్మహత్యకు వేధింపులు కారణం కాదు… డీఎంఈ
ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన జనరల్ సర్జరీ ప్రథమ సంవత్సరం విద్యార్థి సురేశ్ ఆత్మహత్యకు..
సీనియర్ల వేధింపులే కారణమని అతని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు.
సురేష్ ఆత్మహత్యపై ప్రాథమిక విచారణ జరిపామని.. వ్యక్తిగత, అనారోగ్య కారణాల వల్లే అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసిందన్నారు. సీనియర్లు వేధింపులకు పాల్పడ్డట్టు వచ్చిన ఆరోపణల మీద విచారించామని, కానీ, అది వాస్తవం కాదని తేలిందని స్పష్టం చేశారు.
సురేష్ తో పాటు ఎంబీబీఎస్ చదివిన అతని సన్నిహిత మిత్రులే ఉస్మానియా జనరల్ సర్జరీ విభాగంలో అతనికి సీనియర్లుగా ఉన్నారని.. వారితో సురేష్ స్నేహంగా ఉండేవారని వెల్లడించారు.
గతేడాది నవంబరులో జరిగిన ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌లో సురేష్ కు ఉస్మానియాలో జనరల్ సర్జరీ సీటు వచ్చిందని.. అయితే, జనరల్ మెడిసిన్ చేయాలని భావించి, చివరి రౌండ్ కౌన్సెలింగ్ వరకూ అతను ప్రయత్నించారని డీఎంఈ తెలిపారు.
జనరల్ మెడిసిన్ సీటు రాకపోవడంతో, ఈ ఏడాది జనవరిలో ఉస్మానియా సర్జరీ విభాగంలో రిపోర్ట్ చేశారన్నారు. అక్కడ చేరినప్పటి నుంచి 76 రోజులకు గాను 52 రోజులు హాజరయ్యారని, అందులో కేవలం 3 రోజులే నైట్ డ్యూటీ చేశారని వెల్లడించారు.
డ్యూటీల ఒత్తిడి కూడా అతనికి లేదన్నారు. ఆరోగ్య సమస్యకు సురేష్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్య అంశంలో పూర్తిస్థాయి విచారణ కోసం కమిటీని నియమించామని డీఎంఈ వెల్లడించారు.
మరోవైపు సురేష్ ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే సహచర మెడికోతో ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ ఉస్మానియాలోనే పీజీలో చేరారని సహచర పీజీ వైద్యులు వెల్లడించారు.



