
రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్ మెన్
యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్ మెన్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మోటకొండూరు మండలంలోని మేడికుంటపల్లి గ్రామానికి చెందిన రైతు అనంతరెడ్డి.. తన వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని అధికారుల చుట్టూ తిరిగాడు. ఇందుకోసం మూడు నెలల క్రితమే రూ.30 వేల డీడీలు కూడా చెల్లించాడు.
అయినా ఫలితం లేకపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ బిగించాలంటూ పలుమార్లు ఏఈ, అసిస్టెంట్ లైన్మెన్లను వేడుకున్నాడు. పని పూర్తయ్యాక రూ.10 వేల ఇస్తానని కూడా చెప్పాడు. కానీ.. లంచం ఇస్తేనే పని జరుగుతుందంటూ అసిస్టెంట్ లైన్మెన్ రమేష్ పట్టబట్టాడు.
ట్రాన్స్ఫార్మర్ బిగించాలంటే ఏకంగా 35 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైన్మెన్ వేధింపులతో విసిగిపోయిన రైతు అనంతరెడ్డి.. రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు..
రెండు రోజులుగా పక్కా వ్యూహంతో రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో, అనంతరెడ్డి నివాసం వద్ద లైన్మెన్ రమేష్ 35 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంచం అడిగితే సహించేది లేదని, బాధితులు ఎవరైనా ఉంటే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు స్పష్టం చేశారు.




