
ప్రేమించాడు.. పెళ్లికి మాత్రం నో’.
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన పొగుళ్లపల్లి గ్రామంలో కలకలం రేపింది.
సికే న్యూస్ కొత్తగూడ జూన్ 1(పతినిధి : దుర్గం మురళి నేత
కొత్తగూడ మండలం లో ప్రేమ పేరుతో తనను నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో సోమవారం కలకలం రేపింది. పోగులపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు భైరబోయిన మనీషా తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జూల వంశీతో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా ఉన్నాడని, అయితే ఇటీవల పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. ప్రేమించినప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరించి తనను మోసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి వద్దకు చేరుకున్న యువతి, తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని చెబుతూ మౌన దీక్ష చేపట్టింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా, ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజ్‌కుమార్ యువతితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ చేపట్టి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎవరికీ అన్యాయం జరగకుండా కేసును పరిశీలిస్తామని ఎస్సై హామీతో యువతి తన మౌన పోరాటాన్ని తాత్కాలికంగా విరమించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై గ్రామస్థులు, బంధువుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభిస్తుందనే ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.




