Uncategorized
Trending

TGPSCలో కొలువుల జాతర షురూ

TGPSCలో కొలువుల జాతర షురూ

TGPSC: కొలువుల జాతర షురూ

నేడు 280 పోస్టులతో మూడు ప్రకటనలు

వారం వ్యవధిలో మరో మూడు…

ఇక నెలనెలా రెండు లేదా మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు

టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం వెల్లడి

ఉద్యోగార్థులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇకపై ప్రతినెలా రెండు, మూడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. మంగళవారం తొలుత 280 పోస్టులతో మూడు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందులో కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజినీర్లు(9), రోడ్డు భవనాల శాఖలో ఏఈఈ సివిల్‌(222), ఏఈఈ ఎలక్ట్రికల్‌(49) పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థికశాఖ అనుమతించిన ఉద్యోగాలు 3,800 అని, ఇందులో అటవీ బీట్‌ అధికారి పోస్టులు 1,393 ఉన్నాయన్నారు. ఆయా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు సోమవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో సభ్యులు అమీరుల్లాఖాన్, విశ్వప్రసాద్, చంద్రకాంత్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌ రాథోడ్, కమిషన్‌ కార్యదర్శి హరితతో కలిసి బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడారు. మరో వారం రోజుల వ్యవధిలో మూడు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని ఈ నెలలో మొత్తం ఆరు నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు. టీజీపీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కమిషన్‌ విచక్షణాధికారాలు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ ఈవో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు లేవని, ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని వివరించారు. ఇంకా ఏమన్నారంటే…

సీబీఆర్‌టీ పరీక్షలు

‘‘ఉద్యోగ నియామకాలకు సంబంధించి 90% నోటిఫికేషన్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు(సీబీఆర్‌టీ) నిర్వహించాలని కమిషన్‌ భావిస్తోంది. తద్వారా పరీక్షల నిర్వహణ సమయాన్ని తగ్గించవచ్చు. ముద్రణ, తరలింపు, పేపర్‌ లీకేజీ వంటి సమస్యలుండవు. సీబీఆర్‌టీ కావడంతో ఒకరోజు లేదా పరీక్షకు గంట ముందు ప్రశ్నపత్రం ఆటోమెటిక్‌గా సిద్ధమవుతుంది. సీబీఆర్‌టీ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షలో సాధించిన స్కోరు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సీబీఆర్‌టీ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటాం.

ప్రతిభా వారధి ద్వారా…

యూపీపీఎస్సీ ‘ప్రతిభా సేతు’ కార్యక్రమం మాదిరిగా టీజీపీఎస్సీ ‘ప్రతిభా వారధి’ తీసుకురావాలని భావిస్తోంది. లక్షల మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ పరీక్షలు రాస్తారు. రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించినా తుది జాబితాలో చోటు సంపాదించలేకపోయిన వారికి నిరాశే మిగులుతుంది. అలాంటి మెరిట్‌ అభ్యర్థులు ప్రభుత్వంలో ఒప్పంద, ఇతర పోస్టులకు ఎంపికయ్యేలా.. ప్రైవేటులోనూ ఉద్యోగాలు పొందే అవకాశం దీని ద్వారా లభిస్తుంది.

గరిష్ఠంగా తొమ్మిది నెలల్లో

ఒక అంచెలో నిర్వహించే పోటీపరీక్షల నియామకాలను మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తిచేస్తాం. రెండు లేదా అంతకుమించితే ఆయా ఉద్యోగాలను ఆరు నెలల నుంచి గరిష్ఠంగా 9నెలల్లో భర్తీ చేస్తాం.

డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని ఉన్నతవిద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని అమలు చేస్తాం.

కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ సైంటిస్ట్‌(అనలిస్టు గ్రేడ్‌-2) పోస్టులకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 20 పోస్టులకు 19 వేల దరఖాస్తులు వచ్చాయి.

కొన్ని విభాగాల్లో ఒకట్రెండు ఉద్యోగాలున్నాయి. వీటిని ఒకచోటకు చేర్చి నోటిఫికేషన్లు ఇవ్వాలా… లేదా? అనే అంశంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలతో చర్చిస్తున్నాం.

11 రకాల విభాగాల్లో 50కిపైగా పోస్టులున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు నిరంతర నోటిఫికేషన్లు జారీ చేస్తాం. మున్ముందు ప్రతినెలా రెండు, మూడు ఉద్యోగ ప్రకటనలు… అలాగే తుది ఫలితాలు వస్తుంటాయి.

ఉద్యోగార్థులు తమ పూర్తి వివరాలు సమగ్రంగా ఉండేందుకు ఓటీఆర్‌ను అప్‌డేట్‌ చేయాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 32 లక్షల మంది ఓటీఆర్‌ చేసుకున్నారు. వీరిలో కొందరి వయోపరిమితి ముగిసింది. మరికొందరికి ఉద్యోగాలొచ్చాయి. పోటీపరీక్షలకు 7-8 లక్షల మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు’’ అని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button