
వైఎస్ఆర్ రెచ్చగొట్టకపోతే.. రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదు: పవన్ కళ్యాణ్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెచ్చగొట్టకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ సమయంలో లేవని గొంతులు ఈ రోజు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తిన వాడినని.. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
“వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెచ్చగొట్టకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదు. 2005 -2006 సమయంలో బాలు సినిమా తర్వాత నాకు అపెండెక్స్ ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి నా వద్దకు వచ్చారు. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగారు. మీ అన్నగారు రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగితే.. నాకు తెలియదని సమాధానం ఇచ్చా. మిమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆయన నాతో చెప్పారు. కేసులు పెడతారన్నారు. నేను దేనికి అని అడిగితే.. ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారని ఆయన చెప్పారు. అప్పటిదాకా నేను నమ్మలేదు. అలాంటివి ఎందుకు చేస్తారులే అనుకున్నా. కానీ రెండేళ్ల తర్వాత ఆ అధికారి ఎలా చెప్పారో అలాగే చేశారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు లేవని గొంతులు ఈరోజు లేస్తున్నాయి. ఆరోజే నేను గొంతెత్తి, ఎదుర్కొన్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
మరోవైపు వైఎస్ఆర్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించాననే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు అని అన్నారు. తాను తెలంగాణ వెళితే ఎవరూ తనను ఆపలేదని.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే పోలీసులు అడ్డుకుంటారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉంటే అనుమతి ఇవ్వరన్నారు. పవన్ కళ్యాణ్‌కు, రాజశేఖర్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించిన బొత్స.. ఆయనను ఎలా ఎదిరించారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో చనిపోతే కేసులు ఏమైనా అయ్యాయా అని బొత్స ప్రశ్నించారు. టీవీకే విజయ్ సభలో ప్రజలు చనిపోతే కేసులు అయిన విషయాన్ని గుర్తుచేశారు.




