
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు సహా సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున 2:00 గంటలకు చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై డి నరేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోవర్ధనగిరి గ్రామ దర్గా హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు(నం.TG24B9237) అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వారిలో దంత వైద్యురాలు అప్సా హబీబ్(27), సాఫ్ట్వేర్ ఉద్యోగి మహమ్మద్ అసద్(26) ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.




