KhammamPoliticalTelangana

సామాన్యుడి నడ్డి విరుస్తున్న గ్యాస్ దందా..! ఎవరి అండతో ఈ అక్రమాలు..?

సామాన్యుడి నడ్డి విరుస్తున్న గ్యాస్ దందా..! ఎవరి అండతో ఈ అక్రమాలు..?

గ్యాస్ మాఫియా గుప్పెట్లో వినియోగదారులు..!

ఇంటింటికి చేరాల్సిన గ్యాస్ ఒకేచోట పంపిణీ…దీని వెనుక అసలు అంతర్యం ఏమిటి?

సామాన్యుడి నడ్డి విరుస్తున్న గ్యాస్ దందా..! ఎవరి అండతో ఈ అక్రమాలు..?

బ్లాక్ మార్కెట్, అదనపు వసూళ్లు, గృహ గ్యాస్ దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు

సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..? ఇకనైనా జిల్లా అధికారులు స్పందిస్తారా..?

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 27 2026: ప్రభుత్వం సామాన్య ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఇంటింటికీ గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ఏన్కూరు మండలంలో ఆ నిబంధనలు అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ అందించాల్సిన ఏజెన్సీలు ఒకేచోట సిలిండర్లను దించి, వినియోగదారులనే అక్కడికి పిలిపించి పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రతిరోజూ వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే ప్రజలు తమ పనులను వదిలిపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాస్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ప్రభుత్వం కల్పించిన “డోర్ డెలివరీ” సేవను పక్కనబెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వెనుక అసలు కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

బుకింగ్ ధర ఒకటి… వసూళ్లు మరోటి..!

ప్రభుత్వం నిర్ణయించిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.973గా ఉండగా, డెలివరీ సమయంలో అదనంగా రూ.60 వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. “ఈ అదనపు డబ్బు ఎందుకు?” అని ప్రశ్నిస్తే, “ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు” పేరుతో వసూలు చేస్తున్నామని డెలివరీ సిబ్బంది సమాధానం ఇస్తున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి ఈ వసూళ్లు ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నారో అధికారులు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కొత్త గ్యాస్ బుక్ పేరుతో అదనపు భారం..!

గ్యాస్ బుక్ పాతదైందని, కొత్త బుక్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి రూ.120 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఫోన్‌పే, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కాకుండా నగదు రూపంలోనే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. “ప్రస్తుతం మా వద్ద నగదు లేదు… తర్వాత చెల్లిస్తాం” అని చెప్పినా, “డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ సిలిండర్ ఇస్తాం” అంటూ డెలివరీ సిబ్బంది షరతు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఓటీపీ ఉన్నా గ్యాస్ ఇవ్వరా..?

కొంతమంది వినియోగదారులు తమ గ్యాస్ బుక్ పోయిందని, తమ మొబైల్‌కు వచ్చిన డీఏసీ (DAC) ఓటీపీ నంబర్ చెబుతామని తెలిపినా కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. డిజిటల్ సేవలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ రోజుల్లో, ఓటీపీ ద్వారా ధృవీకరణ ఉన్నప్పటికీ సిలిండర్ ఇవ్వకపోవడం వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హోటళ్లలో గృహ వినియోగ గ్యాస్..?

స్థానికుల ఆరోపణల ప్రకారం, కొంతమంది హోటళ్లలో కమర్షియల్ గ్యాస్‌కు బదులుగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా, అసలు అర్హులైన వినియోగదారులకు కూడా ఇబ్బందులు కలిగించే అంశమని ప్రజలు అంటున్నారు.

బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట ఎప్పుడు..?

గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో రూ.2,300 నుంచి రూ.2,600 వరకు విక్రయిస్తున్నట్లు, అలాగే సిలిండర్ మార్పిడి పేరుతో రూ.300 నుంచి రూ.500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్ల వల్ల సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత సివిల్ సప్లై శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతోందా? లేక తెలియక జరుగుతోందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సమగ్ర తనిఖీలు లేకపోవడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ విధానం పూర్తిగా నీరుగారిపోయిందని, గ్యాస్ పంపిణీలో పారదర్శకత కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదనపు వసూళ్లు, గృహ వినియోగ గ్యాస్ దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్ విక్రయాలు, వినియోగదారులపై ఒత్తిళ్లు వంటి అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, గ్యాస్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే గ్యాస్ సిలిండర్లు ఇంటి వద్దకు అందేలా కఠిన చర్యలు చేపట్టాలని ఏన్కూరు మండల ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button