
విద్యుత్ షాక్‌తో స్తంభంపై నుంచి పడిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్
ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో ఘటన..
విద్యుత్ అధికారుల తీరుపై కుటుంబ సభ్యుల ఆందోళన
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 13 2026: ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాల ఏర్పాటు సందర్భంగా విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రబోడు తండాకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మోహన్ విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా ఒక్కసారిగా లైన్ ఆన్ కావడంతో ప్రమాదానికి గురై కిందపడినట్లు సమాచారం.
తిమ్మారావుపేట పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో సెంటిమేరి పాఠశాల వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ నుంచి ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకున్నట్లు తెలిసింది. వీధి దీపాల పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ముందుగానే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు గ్రామపంచాయతీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తిమ్మారావుపేట పంచాయతీలో వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించి సుమారు రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
అయితే ఎల్‌సీ ఇచ్చిన అనంతరం విద్యుత్ లైన్‌ను తిరిగి ఆన్ చేయడంతో స్తంభంపై ఉన్న మోహన్‌కు విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. దీంతో అదుపుతప్పి స్తంభంపై నుంచి కిందపడటంతో నడుముకు తీవ్ర గాయమైనట్లు తెలిసింది. వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా, ప్రమాదానికి విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మోహన్ కుటుంబ సభ్యులు, సర్పంచ్ ఆధ్వర్యంలో తిమ్మారావుపేట విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్‌సీ తీసుకున్న సమయంలో విద్యుత్ సరఫరా ఎలా పునరుద్ధరించబడిందనే అంశంపై అధికారులు విచారణ జరిపితే ప్రమాదానికి దారితీసిన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.




