
తీవ్రంగా గాయపడిన కార్మికుడిని పరామర్శించిన ఎమ్మెల్యే!
Web desc : విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన మున్సిపల్ మల్టీ పర్పస్ కార్మికుడు భూక్యా జైత్రామ్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వైద్యులను ఆదేశించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంగపేట 23వ డివిజన్‌కు చెందిన మున్సిపల్ కార్మికుడు భూక్యా జైత్రామ్ విద్యుత్ స్తంభంపై దీపం ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు.
ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తొలుత కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని మమత జనరల్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జైత్రామ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జైత్రామ్ పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రాణాపాయం నుంచి బయటపడేలా నిపుణులైన వైద్యులతో ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రమాదానికి గురైన జైత్రామ్ కుటుంబానికి అండగా ఉంటామని కూనంనేని సాంబశివరావు భరోసా ఇచ్చారు. జైత్రామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




