
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
Web desc : విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల వ్యవహారంపై ‘ఓ దినపత్రిక’లో వచ్చిన కథనానికి మెదక్ జిల్లా విద్యాశాఖ స్పందించింది. మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు ఎం.నర్సింలును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా సంక్షేమ అధికారి(ఏసీ) సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్(సీసీఏ)రూల్స్ 1991లోని రూల్ 8, సబ్ రూల్(1) ప్రకారం నర్సింలును సస్పెండ్ చేశారు.
ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై అధికారులు స్పందించాలన్న డిమాండ్ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయంపై మండల విద్యాధికారి ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా.. జిల్లా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు అందుబాటులో లేనందున ఉత్తర్వులను మంగళవారం అందజేస్తామని చెప్పారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ మధ్యవర్తిత్వం! పాఠశాలలో బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలును కాపాడేందుకు తెర వెనుక జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా? విచారణ నివేదికను నీరుగార్చేందుకు, సస్పెన్షన్ నుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నించారా అన్న విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు పీజీహెచ్ఎంలు మధ్యవర్తిత్వం చేశారన్న ప్రచారం సాగుతోంది. కాగా, ఈ తెలుగు మాస్టారు మంచోడే.. అంటూ ఆయనకు అనుకూలంగా ఓ ఎమ్మెల్సీ మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఉప్పలయ్య సోమవారం మాట్లాడుతూ తమకు బాలికల నుంచి ఆగస్టు 10న ఫిర్యాదు వచ్చిందని, ఆ మర్నాడు సంక్షేమ శాఖ సిబ్బంది అశోక్ మరో మహిళా ఉద్యోగితో కలిసి విచారణ జరిపారన్నారు. అయితే ఇరవై రోజుల పాటు నివేదికను తొక్కిపెట్టి ఉంచడంలో వారిపై ఒత్తిడి తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి రాజును ఈ విషయమై ప్రశ్నించగా విద్యార్థినులపై వేధింపులు తమ దృష్టికి తీసుకురాలేదని వివరించారు.




