
ఇరుముడి సీన్ రిపీట్ ..విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యంగా!
Web desc : బడిలోనే బాధ్యతాయుతంగా విద్యను నేర్పించాల్సిన ఒక ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి పాఠశాల విద్యార్థినుల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడిన దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది కాలంగా సదరు మాస్టారి వేధింపులు తాళలేక, చివరకు విద్యార్థినులే స్వయంగా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు.. 9, 10 తరగతులు చదువుతున్న బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, అవమానకర రీతిలో మాట్లాడటం, మార్కులు తగ్గిస్తానని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు.
ఆగస్టు 7న పాఠశాలలో ‘గర్ల్ చైల్డ్ మెంబర్ క్లబ్’ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు నిర్వహించిన ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అవగాహన సదస్సు విద్యార్థినులకు ధైర్యాన్ని ఇచ్చింది. 10 మందికి పైగా బాలికలు తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళా ఉపాధ్యాయులకు వివరించారు. ఆగస్టు 11న విద్యార్థినులు నేరుగా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించి తమ కన్నీటి ఘోషను తెలిపారు.
దీని ఆధారంగా శిశు సంక్షేమ శాఖ అధికారులు, షీ టీమ్ ప్రతినిధులు పాఠశాలకు చేరుకుని బాలికల వద్ద నుంచి సమాచారాన్ని, వివరాలను సేకరించారు. ఇంత దారుణం జరిగినప్పటికీ సదరు కీచక ఉపాధ్యాయుడిపై ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారుల స్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఆ ఉపాధ్యాయుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే భయానక వాతావరణాన్ని సృష్టించడంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సదరు ఉపాధ్యాయుడిని విధుల్లో నుంచి తొలగించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




