
భర్త, అత్త వేధింపులతో వివాహిత ఆత్మ*హత్య
భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మ*హత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల కొమురయ్య, సరోజన దంపతుల కుమార్తె అనూష (34)కు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన పర్లపల్లి కిరణ్‌తో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది.
అయితే పదేళ్లుగా సంతానం కలగకపోవడంతో కొంతకాలంగా భార్యాభర్తలు కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల తిరిగి భార్యాభర్తలు కలిసి ఉండటం ప్రారంభించారు. ఈ క్రమంలో సంతానం కలగడం లేదని అనూషను ఆమె అత్త తరచూ దూషిస్తూ, తన కుమారుడికి మరో వివాహం చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష తన తల్లిదండ్రులు నివసిస్తున్న వెంకెపల్లిలోని అద్దె ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అనూష ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె ఆత్మహత్యకు భర్త కిరణ్, అతని తల్లి వేధింపులే కారణమని మృతురాలి తల్లి బత్తుల సరోజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.




