
మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్
Social media viral : హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్-హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం.
అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్‌ను వేడుకున్నారు.
కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తొలుత ఈ దాడికి పాల్పడింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ అని వార్తలు రావడంతో రైల్వే శాఖపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే తక్షణమే స్పందించి అధికారిక వివరణ ఇచ్చింది.
విచారణ అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తి RPF కానిస్టేబుల్ కాదని, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణ కోసం డిప్యుటేషన్‌పై వచ్చిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డుగా గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మహిళపై దాష్టీకానికి పాల్పడిన ఆ హోంగార్డును రైల్వే విధుల నుంచి తక్షణమే తప్పించి, తదుపరి క్రమశిక్షణా చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి తిరిగి పంపించినట్లు రైల్వే యంత్రాంగం వెల్లడించింది.




