KhammamPoliticalTelangana

బాల్యవివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి: షీ టీం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

బాల్యవివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి: షీ టీం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

బాలికల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

బాల్యవివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి: షీ టీం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ అక్టోబర్ 09 2026: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (ఎయిడ్) సంస్థ, పోలీస్‌శాఖ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, విద్య ప్రాధాన్యం, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షీ టీం, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాలికలు కుటుంబానికి వెలుగు, సమాజానికి బలం, దేశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఒక బాలికకు నాణ్యమైన విద్య అందిస్తే ఒక కుటుంబం అభివృద్ధి చెందడంతోపాటు దేశ ప్రగతికి బాటలు పడతాయని పేర్కొన్నారు.

అయితే నేటికీ అనేక ప్రాంతాల్లో బాలికలు బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, లింగవివక్ష, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను అరికట్టి బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలు, మహిళలకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం కోసం అత్యవసర స్పందన నంబర్‌ 112కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సంస్థ గత నాలుగేళ్లుగా జిల్లా యంత్రాంగంతో కలిసి బాల్యవివాహాల నిర్మూలన కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్యవివాహాల నిర్మూలన, బాలికల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలికల హక్కులపై పెట్టుబడి పెట్టడం అంటే వారి విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, నైపుణ్యాభివృద్ధి, సమాన అవకాశాలకు ప్రాధాన్యమివ్వడమేనని వివరించారు. బాలికల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన అవకాశాలు కల్పిస్తే ఆత్మవిశ్వాసంతో తమ భవిష్యత్తును నిర్మించుకోగలరని అన్నారు.

అనంతరం బాలికలు, ఉపాధ్యాయులు, అతిథులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అందరూ కలిసి బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె. శ్రీనివాస్, ఎస్టీయూ బాధ్యులు భాస్కర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ లత, షీ టీం కానిస్టేబుళ్లు రుక్మిణి, కిరణ్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సభ్యులు రాందాస్, రవీంద్రబాబు, భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button