Uncategorized
Trending

నిల్వలు నిండుగా ఉన్నా కృత్రిమ కొరత

నిల్వలు నిండుగా ఉన్నా కృత్రిమ కొరత

నిల్వలు నిండుగా ఉన్నా కృత్రిమ కొరత

-పూటకో రేటుతో బియ్యం వ్యాపారుల దోపిడీ!

మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులు బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అక్రమ నిల్వలతో పూటకో రేటు నిర్ణయిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ వరకు రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు ఏటా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో గత రెండేళ్లుగా సన్న రకం వరి సాగు కూడా పెరిగింది. దీని ఫలితంగా గత సంవత్సరం చివరి దాకా రిటైల్ దుకాణాల్లో సన్న రకం బియ్యం కిలోకు రూ.45 నుంచి రూ.50 చొప్పున, మేలు రకాలు రూ.60 నుంచి రూ.65 చొప్పున దొరికేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. రానున్న ఆరేడు నెలల తర్వాత కొరత ఏర్పడుతుందంటూ ఇప్పుడే సన్నబియ్యం రేట్లు పూటకోసారి పెంచుతున్నారు. బియ్యం రకం, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి కిలోకు రూ.60 మొదలుకొని రూ.85 నుంచి రూ.90 దాకా విక్రయిస్తున్నారు.

అక్రమంగా దాచుతూ కృత్రిమ కొరత!

కేవలం మూడు నెలల కాలంలోనే 30 నుంచి 40 శాతానికి పైగా బియ్యం రేట్లు పెంచేశారు. పైకి మాత్రం మార్కెట్లో బియ్యం లేవని చెబుతున్నారు. కానీ నగరాలు, పట్టణాల్లోని రిటైల్ దుకాణాల్లో బస్తాల కొద్దీ బియ్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తోంది. మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు లక్షల టన్నుల సన్న బియ్యాన్ని తమ గోదాముల్లో అక్రమంగా దాచినట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరి సాగు, సేకరణ భారీ స్థాయిలో కొనసాగాయి. 2019-20లో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 72 లక్షల టన్నులు ఉండగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 148.30 లక్షల టన్నులకు చేరుకుంది. సాధారణంగా రాష్ట్ర అవసరాలకు మించి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ధరలు తగ్గాలి. కానీ బియ్యం వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెరతీశారు.

భవిష్యత్తును సాకుగా చూపి బ్లాక్ మార్కెట్
ప్రస్తుతం మార్కెట్ లో అమ్ముతున్న సన్నబియ్యం గత సంవత్సరం ఖరీఫ్, అంతకంటే ముందు సీజన్లవి. అప్పుడు రాష్ట్ర అవసరాలకు మించి బియ్యం ఉత్పత్తి అయ్యింది. అంటే వాస్తవానికి ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ఎల్నినో ప్రభావం రబీ సీజన్పై ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వచ్చే పంటల మీద ఉంటుంది. ఈ సమయంలో సాగు చేసిన పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత బియ్యం మిల్లింగ్‌కు మరో 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. అంటే సుమారు ఏడాది తర్వాత పరిస్థితిని వ్యాపారులు ఇప్పుడే ఉందంటూ ‘బ్లాక్’ మార్కెట్ దందాకు పాల్పడుతున్నారు.

అప్పుడు కొనకుండా – ఇప్పుడు అధిక ధరలు
ప్రభుత్వం ఇంతకుముందు ఒక దశలో మిగులు ధాన్యాన్ని ఏం చేయాలో తోచక సన్నాలు, దొడ్డు రకాలను విడివిడిగా విక్రయించడానికి టెండర్లు పిలిచింది. 5 లక్షల టన్నుల సన్నవడ్లను వేలం వేయగా, కనీస ధరకు సైతం కొనుగోలు చేయడానికి వ్యాపారులు, మిల్లర్లు ముందుకు రాలేదు. కానీ వారే ఇప్పుడు కృత్రిమ కొరతను సృష్టించి, బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం విస్మయానికి గురి చేస్తోంది. పంట పండించిన రైతులకు ఈ కృత్రిమ ధరల పెరుగుదల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, సామాన్య ప్రజలు అదనంగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గుతుందనే అంచనాలను ఆసరాగా చేసుకొని ముందుగానే నిల్వలను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

రిటైలర్లు సైతం అక్రమంగా దాచేస్తున్నారు..
రాష్ట్రవ్యాప్తంగా వందలాది రైస్ మిల్లర్లు ప్రైవేటుగా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. వీరు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి, హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తారు. వారి నుంచి రిటైలర్లు, కిరాణా దుకాణాలకు బస్తాలు చేరతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో బియ్యాన్ని ప్రైవేట్ గోదాముల్లో నిల్వ చేసి, అక్కడి నుంచి రిటైలర్లకు విక్రయిస్తున్నారు. ఇలా గోదాములతో పాటు రిటైల్ వ్యాపారులు సైతం తమ దుకాణాల్లో భారీగా బియ్యాన్ని నిల్వ చేస్తూ, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

ఈ నిబంధనలకు నీళ్లొదిలారు..
ప్రైవేట్ బియ్యం వ్యాపార కార్యకలాపాల కోసం ‘బి’ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రైతులు, మధ్యవర్తుల ద్వారా సేకరించిన ధాన్యం మిల్లింగ్ ఎంత? విక్రయించిన బియ్యం ఎంత? ఇంకా మిగిలిన నిల్వల వివరాలను నమోదు చేయాలి. అయితే సింహభాగం మిల్లర్లు ఇలాంటి రికార్డులను నిర్వహించడం లేదని తెలుస్తోంది.
బియ్యం అమ్మే వ్యాపారులు లేదా దుకాణదారులు ఎక్కడి నుంచి బియ్యం తెచ్చారు? ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది? అమ్మకపు ధర వివరాలను ప్రతిరోజూ ఒక బోర్డుపై రాసిపెట్టాలి. కానీ ఏ దుకాణంలోనూ ఈ నిబంధన పాటించడం లేదు. ఇక రిటైల్ దుకాణాల్లో బియ్యం ధరలు రోజుకో రకంగా ఉన్నట్లు చెబుతున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button