
రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 8 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత
కలెక్టర్ ఆదేశాలతో భూమిని స్వాధీనం చేసిన రెవెన్యూ అధికారులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 06 2026: ఏన్కూరు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న లచ్చగూడెం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అప్పగించారు. గ్రామంలోని శ్మశానవాటిక సమీపంలో గుట్టపై ఉన్న సర్వే నంబర్ 215లోని ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గిడ్డంగుల సంస్థకు కేటాయించారు.
ఈ మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో భూమి అప్పగింత ప్రక్రియను చేపట్టి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రతినిధి తెగుళ్ల రాజేష్‌కు 8 ఎకరాల భూమిని అధికారికంగా స్వాధీనం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు భూమి కేటాయించడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో గిడ్డంగుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. గిడ్డంగుల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏన్కూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే గిడ్డంగి నిర్మాణ పనుల ప్రారంభం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్‌ఐ శ్రీనివాసరావు, జీపీఓ సీతారత్నం, జీపీఓ శ్రీనివాసరావు, సర్పంచ్ జర సాంబయ్య, ఉపసర్పంచ్ బొల్లెపోగు నరసింహారావుతో పాటు పరిసర ప్రాంత రైతులు పాల్గొన్నారు.




