
సర్పంచ్ ఉంటే ఇందిరమ్మ కమిటీలు ఎందుకు?
-ఎన్నికైన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి కమిటీల పెత్తనం.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు!
-ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలు
– ఎన్నికైన సర్పంచ్‌కు అవమానం.. నిజమైన అర్హులకు అన్యాయం
-పేదల ఇళ్లు పార్టీ కార్యకర్తల పాలవుతున్నాయా?
-గ్రామాల్లో హద్దుమీరుతున్న కమిటీల ఆగడాలు
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని : గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కమిటీల పెత్తనం కొనసాగుతుండటంపై గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లను పక్కనపెట్టి, ఇందిరమ్మ కమిటీలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ జోక్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమైన అర్హులను గుర్తించాల్సిన ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందని, కొందరు అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికైన సర్పంచ్‌లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కమిటీలకు అధికారం కట్టబెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన ఇళ్ల పథకం రాజకీయ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మారుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయాలకు తావులేకుండా, అర్హతే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను గౌరవిస్తూ, కమిటీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపి, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.సర్పంచ్ ఉంటే కమిటీలు ఎందుకు? పేదల ఇళ్ల విషయంలో రాజకీయ పెత్తనం ఎందుకు? అనే ప్రశ్నలు ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.




