
జడ్చర్లలో పాలనపై ఎమ్మెల్యే వ్యాఖ్యలే ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి – బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పండరీనాథ్ రాథోడ్
జడ్చర్ల నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా వెలువడుతున్న వార్తలు, ప్రజాప్రతినిధుల బహిరంగ వ్యాఖ్యలు ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పండరీనాథ్ రాథోడ్ అన్నారు.
ముఖ్యంగా నవంబర్ 16, 2026న జడ్చర్లలో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నవంబర్ 17న పలు వార్తా మాధ్యమాల్లో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారిందన్నారు.
ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వ పనుల బిల్లులు క్లియర్ చేయడానికి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారని, రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు పనికి సంబంధించిన మెజర్‌మెంట్ బుక్ (MB) నమోదు చేయడానికి కూడా కమిషన్ అడుగుతున్నారని పేర్కొన్నారని గుర్తుచేశారు.
అంతేకాకుండా, తాను స్వయంగా ఒక వ్యక్తి పని చేయాలని అధికారిని కోరినా పట్టించుకోలేదని, అదే వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే పని పూర్తయిందని ఎమ్మెల్యే వెల్లడించినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. అయితే, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే తన ప్రభుత్వంలోని అధికారులపై ఇంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, రాష్ట్రంలో అసలు పాలన ఎలా సాగుతోందనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోందని పండరీనాథ్ రాథోడ్ అన్నారు.
ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే, వాటిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? ప్రజాప్రతినిధుల ఆదేశాలకే అధికారులు స్పందించని పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుంది? కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? జడ్చర్ల నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు కావాల్సింది నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు కాదు, ప్రభుత్వ ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయిలో కనిపించే అభివృద్ధి, అవినీతికి తావులేని పారదర్శకమైన పాలన, అధికారుల జవాబుదారీతనం, సామాన్యులకు సకాలంలో ప్రభుత్వ సేవలు, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలని పండరీనాథ్ రాథోడ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం నిలబెట్టుకోవాలంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో జవాబుదారీతనం చూపించాలని ఆయన పేర్కొన్నారు.




