
హెరిటేజ్ ఫుడ్స్‌లో డ్రమ్ పేలుడు.. మహిళ దుర్మరణం! కంపెనీ ఎదుట ఆందోళన
ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో డ్రమ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో పింకీ దేవి(35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఫ్యాక్టరీ పరిసరాల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్ గాంధీనగర్‌లో నివాసముంటున్న పింకీ దేవి హెరిటేజ్ ఫుడ్స్‌లో పనిచేస్తున్నారు.
శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలను పారవేసేందుకు మొదటి అంతస్తులోని డ్రమ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్రమ్ పేలడంతో ఆమె తీవ్ర ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.మృతురాలు బీహార్‌కు చెందిన హరేంద్ర షా భార్య ఆమెకు రీసు, ప్రిన్స్, క్రియాంశ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన పరిస్థితి కుటుంబ సభ్యులను కలచివేస్తోంది.
కంపెనీ ఎదుట కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఆందోళన
పింకీ దేవి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
డ్రమ్ పేలుడుకు గల కారణాలు ఏమిటి? అందులో రసాయనాలు లేదా ఇతర పదార్థాలు ఉన్నాయా? ప్రమాదం ఎలా సంభవించింది? ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు, కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు.




