
మంత్రి దామోదర రాజనర్సింహకు కేటీఆర్ ఫోన్..!
Web desc : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఆదివారం (నవంబర్ 22) వరంగల్లో బీఆర్ఎస్ జనచైతన్య పేరుతో భారీ బహిరంగ సభ తలపెట్టిన విషయం తెలిసిందే.
ఈ సభకు వెళ్తుండగా కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళన చేయడం గమనించి కేటీఆర్ ఆగారు. కాలేజీకి సంబంధించి తమ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థులు ఆయనను కోరారు.
దీంతో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కేటీఆర్ స్వయంగా మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఫోన్ చేసి మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ కాల్ కు స్పందించిన మంత్రి దామోదర..
కరీంనగర్ వైద్య విద్యార్థుల సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తామని ఫోన్ కాల్‍లోనే హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున అందరం అండగా ఉంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.




