‘ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?’.. అల్లుఅర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా..
సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు.
” ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?. ఫిలిం స్టార్, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కారులో వచ్చి సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కారులోనుంచి బయటికి వచ్చి హడావుడి చేశారు. దీంతో జనం ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం నాకు బంధువులే.
హోంశాఖ నా వద్దే ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్టు నాకు తెలుసు. సినిమా వాళ్లు పైసలు పెట్టారు. లాభాలు సంపాదించారు. వాళ్లు దేశం కోసం చేసిందేమి లేదు. అల్లు అర్జున్ అరెస్టులో మా ప్రమేయం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయింది. ఆమె కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు ?. జనం ప్రాణం పోయినా కేసు పెట్టందా అంటూ ” రేవంత్ అన్నారు.