ఆకతాయిల అసభ్య నృత్యాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి

ఆకతాయిల అసభ్య నృత్యాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి;

By :  Ck News Tv
Update: 2025-03-13 07:47 GMT

ఆకతాయిల అసభ్య నృత్యాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి

ఏపీలోని విజయనగరం జిల్లాలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై ఆకతాయిలు దాడి చేశారు. వేపాడ మండలంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసభ్యంగా డాన్స్ చేశారు.

అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్‌ఐపై దాడి చేశారు. దీంతో, సదరు ఎస్‌ఐ.. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్‌ బేబీ డాన్స్‌ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.

Full View

గుడివాడ మోహన్‌ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్‌ఐ బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన యువకులు.. విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఆమె ప్రాణభయంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వెంటాడి అక్కడ రభస సృష్టించారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్‌ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్‌ ఎస్సై అప్పలనాయుడు, ఎల్‌ కోట, కొత్తవలస పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ దేవీకి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇక, ఈ ఘటనపై ఎస్‌ఐ దేవీ.. సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న గుడివాడ మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్‌, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్‌ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News