ఖమ్మంలో మున్సిపల్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ఖమ్మంలో మున్సిపల్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం;

By :  Ck News Tv
Update: 2025-03-06 04:31 GMT


ఖమ్మంలో మున్సిపల్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం


ఖమ్మం నగర పాలకసంస్థ (కేఎంసీ) కార్యాలయ అటెండర్‌ డీ మాధవి కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌ ఎదుట బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది.

గమనించిన కేఎంసీ సిబ్బంది.. ఆమెను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. మాధవి 20 ఏళ్లుగా కేఎంసీలో అటెండర్‌గా పనిచేస్తున్నది. హెల్త్‌ వర్కర్‌గా విధుల్లో చేరిన ఆమెను.. గతంలో పనిచేసిన మేయర్‌ అటెండర్‌గా బదిలీ చేశారు.

జనవరి 6న పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌గా విధులను కేటాయిస్తూ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ విధులను నిర్వర్తించలేనని, అటెండర్‌గానే విధులు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కమిషనర్‌, మేయర్‌ను కోరారు. దీంతో అటెండర్‌గానే డ్యూటీ చేసుకోవాలని వారు మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ హెల్త్‌ వర్కర్‌గా ఎందుకు వెళ్లడం లేదంటూ పలుమార్లు ఆమెకు షోకాజ్‌ నోటీసులు అందగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ మెమోలకు జవాబు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కమిషనర్‌ పేరుతో గురువారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

శుక్రవారం ఆ ఉత్తర్వులను ఇంటికి పంపించారు. నోటీసులకు, మెమోలకు తాను సమాధానం ఇచ్చినప్పటికీ తనను సస్పెండ్‌ చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కమిషనర్‌కు చెప్పేందుకు శుక్రవారం కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. వారం రోజుల తరువాత కలవాలని సీసీ ద్వారా సమాచారం అందించారు. బుధవారం Full Viewమరోసారి వెళ్లినా కమిషనర్‌ టైం ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెంది కమిషనర్‌ చాంబర్‌ ఎదుటే నిద్రమాత్రలు మింగింది. కాగా బదిలీ చేసిన చోట జాయిన్‌ కానందునే మాధవికి నోటీసులు ఇచ్చామని, వాటికి స్పందించకపోవడంతోనే సస్పెండ్‌ చేశామని కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య వివరించారు.

Similar News