ప్రేమ వేధింపులకు యువతి ఆత్మహత్య...!

ప్రేమ వేధింపులకు యువతి ఆత్మహత్య...!;

By :  Ck News Tv
Update: 2025-03-09 05:56 GMT

ప్రేమ వేధింపులకు యువతి ఆత్మహత్య...!

ప్రేమ వేధింపులకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్ ఎస్ మండలం, పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన బీమగాని కృష్ణయ్య, మన్నెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

పెద్ద కుమార్తె బీమగాని మాధవికి మల్క గోపీకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు.

జీవనోపాధి కోసం చైతన్యపురిలోని బాబు కాంప్లెక్స్‌ రోడ్ నంబర్ 2 లో నివసిస్తున్నారు. కృష్ణయ్య చిన్న కుమార్తె బీమగాని గంగోత్రి( 22) ఉద్యోగం చేస్తూ 18 నెలల నుండి అక్క, బావతో కలిసి చైతన్యపురిలో ఉంటుంది.

గంగోత్రి అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో గ్రామానికి చెందిన కేశబోయిన మహేశ్‌ అనే వ్యక్తి గంగోత్రిని ప్రేమించాలంటూ వేధిస్తుండేవాడు. గంగోత్రి మహేష్ ప్రేమను తిరస్కరించింది.

కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా అతను ఆమెను అనుసరించి వేధించేవాడు. అతని టార్చర్ కారణంగా తన మొబైల్‌ను కూడా తొలగించి విషయం తన తండ్రికి తెలిపింది.

ఈ నెల 7 న రాత్రి 10 గంటల సమయంలో గంగోత్రి తండ్రి కృష్ణయ్యకు ఫోన్ చేసి కేశబోయిన మహేష్ తనను ప్రేమించమని రోజూ వేధిస్తున్నాడని తనకు చాలా భయంగా ఉందని చెప్పింది.

శనివారం 8 వ తేదీన గోపికృష్ణ ఉదయం 8:30 గంటలకు కృష్ణయ్య కు ఫోన్ చేసి, తను, తన భార్య, గంగోత్రి, అందరం కలిసి రాత్రి భోజనం చేసి పడుకున్నామని గంగోత్రి గది నుంచి బయటకు రాకపోవడంతో గదికి వెళ్లి చూడగా తలుపు లోపల నుంచి గడియ వేసి ఉందని చెప్పాడు.

గంగోత్రికి ఫోన్ చేసినా తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో తలుపులు పగులగొట్టి గదిలో చూడగా గంగోత్రి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని చనిపోయిందని మామకు తెలిపాడు.

వెంటనే స్వస్థలం నుండి బయలుదేరి చైతన్యపురికి కృష్ణయ్య వచ్చి తన కుమార్తె గంగోత్రి మృతికి కేశబోయిన మహేష్‌పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Similar News