బ్యాలెట్ బ్యాగులతో వెళ్తున్న రెండు బస్సులకు ప్రమాదం..19మందికి గాయాలు
బ్యాలెట్ బ్యాగులతో వెళ్తున్న రెండు బస్సులకు ప్రమాదం..19మందికి గాయాలు;
బ్యాలెట్ బ్యాగులతో వెళ్తున్న రెండు బస్సులకు ప్రమాదం..19మందికి గాయాలు
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..
తెలంగాణలోని పలు జిల్లాల మాదిరిగానే గురువారం సాయంత్రం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిమాజామాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు.
ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిళికొండ వద్దకు చేరుకోగానే నిర్మల్-బాన్సువాడకు చెందిన బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎన్నికల సిబ్బంది ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు.
బస్సు డ్రైవర్ మోయినోద్దీన్, పురుషోత్తం అనే అధికారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మినహా మిగతా అందరూ గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు మూడు రోజులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు మరో 36 గంటల చొప్పున సమయం పట్టవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.