KhammamPoliticalTelangana

గార్లఓడ్డులో కోతుల బెడదకు చెక్..

గార్లఓడ్డులో కోతుల బెడదకు చెక్..

గార్లఓడ్డులో కోతుల బెడదకు చెక్..

గ్రామస్తులతో కలిసి కోతులను తరిమికొట్టిన గ్రామ పెద్దలు

ప్రజల సమస్యకు స్పందించి ప్రత్యేక కార్యక్రమం.. అడవివైపు తరలించిన గ్రామస్తులు

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 04 2026: ఏన్కూరు మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామపంచాయతీలో గత కొంతకాలంగా కోతుల బెడద తీవ్రరూపం దాల్చడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, చిన్నారులు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం, రైతుల పొలాల్లో పంటలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ పెద్దలు వెంటనే స్పందించారు.
ఈ నేపథ్యంలో శనివారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యా లాలు నాయక్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు కలిసి కోతులను గ్రామం నుంచి అడవివైపు తరిమికొట్టే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కోతులను పెద్దగుట్టల ప్రాంతం వైపు తరలించే ప్రయత్నం చేశారు.
కోతులను గ్రామానికి దూరంగా పంపించేందుకు గ్రామస్తులు డప్పులు, విజిల్స్, ఇతర శబ్ద పరికరాలతో పాటు క్యాట్ బాల్స్, సైకిల్ టైర్లతో మంటలు వెలిగించి పెద్ద శబ్దాలు చేస్తూ వాటిని భయపెట్టారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాల్గొని కోతులను అడవివైపు తరిమేందుకు కృషి చేయడంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కోతుల బెడద వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల భద్రతతో పాటు రైతుల పంటలను కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైతే అటవీ శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో కోతులను అడవివైపు తరలించే కార్యక్రమం విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా కోతుల బెడద కొనసాగితే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని చూసిన గ్రామ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన గ్రామ పెద్దలు, సొసైటీ అధ్యక్షులు, సర్పంచ్, కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులను అభినందించారు. గ్రామంలో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button