కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
– అనంతరం బాధితుల నుంచి వినతుల స్వీకరణ
– వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశం
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి పథక లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణలక్ష్మి పథకం కింద 43 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116ల చొప్పున చెక్కులను అందజేసినట్లు అన్నారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో అంకుర్ వరి విత్తనాలు సాగుకు విత్తగా 60 రోజుల్లోనే ఈనిందని న్యాయం చేయాలని రైతులు మంత్రిని కోరగావ్యవసాయ శాఖ జెడి తో ఫోన్లో మాట్లాడారు.
విచారణ చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు ఇస్తే పిడి యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. సర్వే పరీక్ష ఉత్తీర్ణత పొందిన ప్రయివేటు సర్వేయర్లకు తగు పరీక్ష చేపట్టి, లైసెన్స్ ఇవ్వాలని జెడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ను మంత్రి ఆదేశించారు.
సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తుదారులు రాగా సదరం క్యాంపు చేపట్టి వైకల్యం ఉన్న వారికి సర్టిఫికెట్ అందజేయాలని మంత్రి సూచించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం చెరువు శిఖం, పట్టా భూముల సమస్యను సర్వే చేసి పరిష్కరించాలన్నారు.
కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో ఖబరస్థాన్ కి ప్రహారి గోడ, 2 విద్యుత్ స్తంభాలు అవసరమున్నట్లు, వీటికై చర్యలు తీసుకోవాలన్నారు. 11కెవి, 22కెవిలకు షిఫ్టింగ్ నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
తిరుమలాయపాలెం మండలం కేశవాపురం గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా కు సంబంధించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, దేవాదాయ భూమి ఒక్క గజాన్ని వదిలే ప్రసక్తి లేదని, ఫెన్సింగ్, రక్షణ ఏర్పాట్లు చేసి, అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అనంతరం తీర్థాల, కూసుమంచి శివాలయం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని, త్రాగునీటికీ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జాతరలకు వచ్చే రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
గత జాతరల కంటే మంచిగా, ఎలాంటి లోతుపాట్లు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఆర్ అండ్ బి ఇఇ కె. శ్యామప్రసాద్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఎడి ఫిషరీస్ ఆంజనేయ స్వామి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, వ్యవసాయ, విద్యుత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.