
అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి..
Web desc : వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బండ మంజుల (29) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటన పలు అనుమానాలకు దారి తీసింది.
మంజుల మృతిపై ఆమె పుట్టింటి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. అత్తింటి వారు వేధింపులకు గురిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో శేరిలా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంజులకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.




