
సీతారామ కాలువపై ‘సీకే న్యూస్’ కథనానికి స్పందన..
అధికారులు స్పందించడంతో మరమ్మతులు.. రైతులకు ఇబ్బందులు తొలగింపు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 15: ఏన్కూర్ మండల పరిధిలోని సీతారామ ఎత్తిపోతల పథకం కాలువలో సైడ్ సీసీ పనులు దెబ్బతినడంపై ‘సీకే న్యూస్’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కాలువ వద్ద ఏర్పడిన సమస్యలను పరిశీలించిన సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి అవసరమైన పనులను పూర్తి చేశారు.
కాలువలో నీటి ప్రవాహం కారణంగా దెబ్బతిన్న సైడ్ సీసీ ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్ఠం చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా అవసరమైన పనులను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
కాలువ నిర్మాణంలో నాణ్యతపై రైతులు వ్యక్తం చేసిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భవిష్యత్తులో నీటి ప్రవాహం పెరిగినా కాలువ గట్లు దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా వార్త ప్రచురించడంతో స్పందించి పనులు పూర్తి చేయడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులపై ఇకముందు కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, చిన్నపాటి లోపాలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.




