
సికే న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు
ఏన్కూరులో మురుగు నీటి సమస్యకు చెక్..
అధికారుల తనిఖీ, డ్రైనేజీ పనులు ప్రారంభం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 27 2026:ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు ఎదురుగా ఉన్న సందులో నెలలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న మురుగు నీటి సమస్యపై అధికారులు స్పందించారు.
సీకే న్యూస్లో కథనం ప్రసారమైన వెంటనే సంబంధిత శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
స్థానిక ప్రజలతో మాట్లాడిన అధికారులు, ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగు నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. దుర్వాసన, దోమల బెడద, అనారోగ్యాల ప్రమాదంపై స్థానికులు అధికారులకు తమ గోడును వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు తక్షణ చర్యలుగా మురుగు నీరు నిల్వ కాకుండా తాత్కాలిక మార్గం ఏర్పాటు చేయడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. జేసీబీ సహాయంతో కాలువ తవ్వకాలు చేపట్టి, మురుగు నీరు సక్రమంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ…
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను నిర్లక్ష్యం చేయబోమని, త్వరితగతిన డ్రైనేజీ పనులు పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అలాగే శుభ్రత చర్యలు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ కార్యక్రమాలు కూడా చేపడతామని వెల్లడించారు.
ఎన్నాళ్లుగా సమస్యతో ఇబ్బంది పడుతున్న స్థానికులు అధికారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగించాలని కోరుతున్నారు. సీకే న్యూస్ కథనంతో అయినా సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.




