
ఏన్కూరులో కాంగ్రెస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
రాహుల్ గాంధీని విడుదల చేయాలి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 22 2026: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఏన్కూరు ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబించిందని విమర్శించారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.
నీట్ (NEET) సంస్థను వెంటనే రద్దు చేసి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, ఆ హక్కును అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను విడనాడి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




