
కుక్క కాటు ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి..
కుక్క కాటు నివారణకు వేసిన ఇంజెక్షన్ వికటించడంతో రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందగా, ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) లో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డిలోని అయ్యప్పనగర్‌లో ఉంటున్న కల్లూరి రమేశ్, అర్చన దంపతుల రెండున్నరేండ్ల కుమార్తె క్రితార జనవరి 25న ఇంటి దగ్గర ఆడుకుంటోంది.
ఈ టైంలో కుక్క కరవడంతో సర్కార్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. వెంటనే ఫస్ట్ డోస్ ఇంజక్షన్, 28న రెండో డోస్ ఇంజక్షన్ ఇచ్చారు. ఆదివారం మూడో డోస్ కోసం తండ్రి రమేశ్ చిన్నారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు.
ఇంజక్షన్ చేయించుకొని తిరిగి వెళ్తుండగా.. పాప తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు పల్స్ లేదని చెప్పడంతో తిరిగి సర్కార్ హాస్పిటల్‌కు తీసుకురాగా అప్పటికే చనిపోయింది.
సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, కాలనీవాసులు ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు చేరుకొని, డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు.
కొందరు వ్యక్తులు హాస్పిటల్ ఫర్నీచర్, అద్దాలను పగులగొట్టి లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
పోలీసులు హాస్పిటల్ వద్దకు వచ్చి ఆందోళనకారులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సుమారు మూడున్నర గంటల పాటు ఆందోళన కొనసాగింది.
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు హాస్పిటల్ వద్దకు చేరుకొని బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో డాక్టర్ రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ నరహరి చెప్పారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తామని ఆర్‌ఎంవో సంతోష్ తెలిపారు.




