
కేజీబీవీలో విద్యార్థినిపై పీఈటీ దాడి.. విరిగిన భుజం ఎముక! ఆలస్యంగా వెలుగులోకి
Web desc : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నాక్స్ బాక్స్ తీసుకురాలేదనే కారణంతో ఓ విద్యార్థినిని గెస్ట్ వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) కర్రతో కొట్టడంతో ఆమె భుజం ఎముకకు తీవ్ర గాయమైనట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణ కుమార్తె కాసిని వాసవి (16) ఏడో తరగతి నుంచి అన్నపురెడ్డిపల్లి కేజీబీవీలో చదువుతోంది.
ప్రస్తుతం పదో తరగతి అభ్యసిస్తోంది. ఇటీవల పాఠశాలలో స్నాక్స్ కోసం బాక్స్ తీసుకురాలేదనే కారణంతో గెస్ట్ పీఈటీ స్వాతి కర్రతో వాసవిని కొట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో బాలిక భుజానికి తీవ్ర గాయమైందని, ఎముక విరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన నొప్పి, జ్వరంతో బాధపడుతున్న కుమార్తెను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.
భుజం ఎముక వద్ద తీవ్ర గాయం, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం సోమవారం బాలికను పాఠశాలకు తీసుకెళ్లి ఘటనపై సంబంధిత ఉపాధ్యాయులను ప్రశ్నించగా, సదరు పీఈటీ విధులకు రాలేదని వారు సమాధానమిచ్చినట్లు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు తోటి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనతో పాఠశాలలోని ఇతర బాలికలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థినిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.
హాస్టళ్లలో ఏం జరుగుతోంది? అన్నపురెడ్డిపల్లి మండలంలోని ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీల్లో విద్యార్థుల భద్రతపై పర్యవేక్షణ కొరవడిందా? బాలికలపై దాడులు జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి కేజీబీవీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థినులకు భద్రత కల్పించాలని మండల ప్రజలు కలెక్టర్‌ను కోరుతున్నారు.




