
మలక్‌పేట్‌లో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి!
Web desc : హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న హేమలత (28)పై గుర్తుతెలియని వ్యక్తి కూరగాయలు కోసే కత్తితో దాడి చేసి, ఆమె సెల్‌ఫోన్‌ను అపహరించి పరారయ్యాడు. గడ్డి అన్నారం ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
గదిలోకి చొరబడి కత్తితో దాడి
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన హేమలత మరో ఐదుగురు మహిళలతో కలిసి గడ్డి అన్నారం ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకొని గత కొద్దిరోజులుగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సుమారు 5.45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె గదిలోకి ప్రవేశించాడు. అనంతరం కూరగాయలు కోసే కత్తితో హేమలత కడుపులో పొడిచి, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. 100కు ఫోన్.. బాధితురాలిని ఆసుపత్రికి తరలింపు
దాడి ఘటనను గమనించిన పక్క గదిలోని హేమలత స్నేహితులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హేమలత పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు సమాచారం.
నిందితుడి కోసం పోలీసుల ఆరా.. యువతిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? దాడికి గల కారణాలేమిటి? సెల్‌ఫోన్ అపహరణ కోసమే ఈ దాడికి పాల్పడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




