
తెలంగాణపై ‘అర్నబ్ తుఫాన్’ ఎఫెక్ట్.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..
Web desc : బంగాళాఖాతంలో భయం రేపుతున్న ‘అర్నబ్’ తుపాను.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తుపాను విశాఖపట్నం, బాపట్ల మధ్య యానాం దగ్గర బుధవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుపాను ప్రభావంతో భారీ వర్షాలతోపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఎపిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై కుాడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు సంభవించి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిల్చోకూడదని హెచ్చరించింది.
తుపాను కదలికలకు అనుగుణంగా వర్షాల తీవ్రతలో మార్పులు ఉండవచ్చని, వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. వర్షాల సమయంలో వాగులు, వంకలు, చెరువుల సమీపానికి ఎవరూ వెళ్లకూడదని సూచించారు.
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్
పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి
అధికారుల సెలవులు రద్దు, హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లరాదు
విద్యుత్ స్తంభాలు, పాత గోడలు, భారీ వృక్షాలకు దూరంగా ఉండాలి
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్థానిక వాతావరణ పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలించాలని, భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు, సంబంధిత శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీఓలు) అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.
తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులు, ఇతర సిబ్బందికి మంజూరు చేసిన సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులకు హాజరై, తమ హెడ్‌క్వార్టర్లలోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
విద్యుత్ అంతరాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి:
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో భారీ వృక్షాలు, చెట్లుకూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు చెట్ల కింద నిలబడరాదని కలెక్టర్ సూచించారు.
పాతబడిన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




