
తహసీల్దార్ ఆఫీస్‌కు తాళం.. అధికారులంతా ‘లాంగ్ లీవ్’!
సోషల్ మీడియాలో వైరల్ : గోదావరిఖని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా జరగని వింత రామగుండంలో జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రజలకు కీలకమైన సేవలు అందించే ఎమ్మార్వో కార్యాలయం రోజులు గడుస్తున్నా తాళం వేసి ఉండటం ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎమ్మార్వోతో పాటు కార్యాలయంలోని సిబ్బంది అంతా మూకుమ్మడిగా లాంగ్ లీవ్‌లోకి వెళ్లడంతో సాధారణ ప్రజల పనులు పూర్తిగా స్థంభించిపోయాయి.
విద్యార్థులు ముఖ్యంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం దృష్ట్యా కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం కార్యాలయాన్ని ఆశ్రయిస్తుండగా, అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పంట భూముల రిజిస్ట్రేషన్, ఇతర రెవెన్యూ పనులు నిలిచిపోవడంతో వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోజూ కార్యాలయానికి వస్తున్న ప్రజలు అక్కడికి వచ్చి తాళం వేసిన రామగుండం ఎమ్మార్వో ఆఫీస్ ను చూసి వెనుదిరుగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, అధికారులందరూ ఒకేసారి సెలవులోకి వెళ్ళడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.
ఈ విషయంపై పెద్దపెల్లి జిల్లా కలెక్టర్‌ను ఫోన్లో వివరణ అడగగా మాకు కూడా పూర్తి సమాచారం లేదు అంటూ సమాధానం ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. బాధ్యత గల ఉన్నతాధికారులే ఇలా స్పందించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.
అధికారులు ఒకేసారి లీవ్‌కు గల కారణం ఏమిటి ?రామగుండం మండల రెవెన్యూ కార్యాలయంలో ఎమ్మార్వో తో సహా కిందిస్థాయి ఉద్యోగులందరూ ఒకేసారి లాంగ్ లీవ్ పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. ప్రజల సమస్యల కోసం నియమితులైన ఉద్యోగులు ప్రజల సమస్యలు పక్కన పెట్టి, ఇలా చేయడం ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు : మండల రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిత్యం అనుసంధానమై ప్రజలకు అవసరమైన పనులు చేస్తుంటారు.
కానీ రామగుండం ఎమ్మార్వో కానీ అధికారులు కానీ అలా చేయకుండా ముకుమ్మడిగా లాంగ్ లీవ్ పెట్టుకొని ఆఫీసుకు తాళం వేసిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆగ్రహం మరింత పెరిగే అవకాశముంది.
ఇక్కడ ఎనిమిది ఓ వింత జరిగేలా ఉంది రాష్ట్రంలో ఎక్కడైనా ఎమ్మార్వో ఆఫీసులకు తాళం వేసుకున్న సంఘటనలు ఉన్నాయా.. రామగుండం ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు గత నాలుగు రోజులుగా ఆఫీసుకు తాళం వేసి ఉండడమేమిటి.
కార్పొరేషన్ లో మూడు లక్షల జనాభా ఉన్నారు. వారికి నిత్యం అవసరమయే పనులు కాకా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి.- కౌశిక హరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు..
ఎమ్మార్వో ను నియమించాలి… రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేక ప్రజలు, విద్యార్థులు, సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పాడుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేసి సమస్యను తెలియపరిచారు.
గత నాలుగు రోజులుగా కార్యాలయానికి తాళం వేసి ఉండడం పట్ల కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు.- బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి



