
‘సీట్ చోరీ’తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అప్రజాస్వామ్యం
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీజేపీ కుట్ర రాజకీయాలకు మరో నిదర్శనం
న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం
ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుంది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
హైదరాబాద్:
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్య అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ మరోసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆయన విమర్శించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ‘వోట్ చోరీ’, ‘ఎస్ఐఆర్’ వంటి వివాదాస్పద చర్యలకు పాల్పడిన బీజేపీ, ప్రజల హక్కులతో చెలగాటం ఆడుతుందని. ఇప్పుడు మరో హేయమైన చర్య ‘సీట్ చోరీ’కి కూడా తెరలేపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల మద్దతుతో గెలవలేని పరిస్థితిలో ప్రత్యర్థులను కుట్రపూరితంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అయినప్పటికీ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక అభ్యర్థిపై జరిగిన అన్యాయం మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడి అని అన్నారు.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రయత్నించగా అడ్డుకోవడం మరింత ఆందోళన కలిగించే అంశమని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు దేశానికి మంచివి కావన్నారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజల గొంతుకలను అణచివేసే ప్రయత్నమేనని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ చర్యను ఖండించాలని పిలుపునిచ్చారు.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని, న్యాయం జరిగే వరకు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.




