
శ్రేయాంకకు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై మైదానం వీడిన టీమిండియా స్టార్
Web desc : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ వేళ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం (జూన్ 17) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.
ఆరవ ఓవర్ తొలి బంతి వేసిన శ్రేయాంక బ్యాటర్ కొట్టిన బాల్‌ను ఆపబోయే క్రమంలో గాయపడింది. కుడి కాలు చీలమండలానికి గాయం కావడంతో నొప్పితో అల్లాడుతూ స్టేడియంలో కుప్పకూలిపోయింది.
వెంటనే మైదానంలోకి వచ్చిన టీమ్ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి.. కాలుకు పట్టీ వేసింది. అయినప్పటికీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శ్రేయాంక కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లారు.
శ్రేయాంక మైదానాన్ని వీడటంతో ఆ ఓవర్‌ను షఫాలీ వర్మ పూర్తి చేసింది.గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్‌లకు శ్రేయాంక అందుబాటులో ఉంటుందా లేదా అనే దానిపై సందేహాలు తలెత్తాయి.
టోర్నమెంట్లో భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు (జూన్ 21న దక్షిణాఫ్రికా, జూన్ 25న బంగ్లాదేశ్‌తో) ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అనేది వైద్య పరీక్షల నివేదికల అనంతరం స్పష్టమవుతుంది. ఒకవేళ గాయం కారణంగా శ్రేయాంక దూరమైతే టీమిండియాకు ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.
శ్రేయాంక గాయంపై బీసీసీఐ అప్డేట్ : శ్రేయాంక గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్డేట్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేసే ప్రయత్నంలో శ్రేయాంక పాటిల్‌కు గాయమైంది.
ఆమెను స్ట్రెచర్‌పై మైదానం నుండి బయటకు తీసుకువెళ్లారు. ఆమె త్వరగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని బీసీసీఐ తెలిపింది.




